dcsimg

రోహిత పక్షి ( Telugo )

fornecido por wikipedia emerging languages

రోహిత పక్షులు ఫీనికోప్టేరిడే అనే కుటుంబానికి చెందిన నీటిప్రాంతాలలో పాదంలోతు నిలబడి ఆహారంకోసం (చేపలు) ఎదురుచూసే పక్షులలో ఒక రకం. అమెరికాలో నాలుగురకాల రోహితపక్షులున్నాయి., పూర్వ ప్రపంచంలో (ఆసియా, ఐరోపా, ఆఫ్రికా) రెండురకాలున్నాయి.

వర్గీకరణ

పెంపకంలో మేతమేస్తున్న రోహితాలు

వీటి ఆంగ్లనామం "ఫ్లెమింగో" అనేది ఒళంద (పోర్చుగీస్) లేదా స్పన (స్పానిష్) నామమైన "ఫ్లేమెంగో" అనగా "మండుతున్న"అనే పదంనుండి వచ్చింది. తెలుగు నామమైన "రోహిత పక్షి"అనేది సంస్కృతనామమైన "రోహితమ్"అనగా "ఎర్రని" లేదా "అగ్నివర్ణము/నిప్పురంగు"అని అర్థం. వీటి అచ్చతెలుగు పేరు "పువ్వు కొంగ" లేదా "పూవు కొంగ" అని చెప్పవచ్చు.

 src=
రోహిత పక్షి అస్థిపంజరము

వర్ణన

రోహితాలు సాధారణంగా ఒంటికాలుపై నిలబడి, తమ రెండవకాలును శరీరాలలో కనబడకుండా దాచివేస్తాయి. అవిలా ఎందుకు చేస్తాయో పూర్తిగా ఎవరికీ తెలియదు. ఒక సిద్ధాంతమేమిటంటే, అలా ఒంటికాలుపై నిలబడటం వలన ఆ పక్షి చల్లని నీటిలోనున్నప్పటికీ తన శరీరంలోని వేడిని ఎక్కువగా కోల్పోదు. కాని ఈ పక్షులు వేడినీటిలోకూడా అలాగే చేస్తాయి. ఇవే కాదు, అలా నీటియందు నిలబడి చేపలను తినే ఇతర జాతుల పక్షులు కూడా అలాగేచేస్తాయట! మరొక సిద్ధాంతమేమిటంటే రెండుకాళ్లపై నీటిలో నిలబడటం కన్నా ఒంటికాలుపై నిలబడటమే తక్కువ శక్తిని వినియోగించుకుంటుందంట. రోహితపక్షులు కేవలం నీటిలో నిలబడటం మాత్రమే గాకుండా తమ తెప్పల లాంటి పాదాలను నీటి అడుగునున్న మట్టిలోకి జొప్పిస్తాయి. రోహితపక్షులు చక్కగా ఎత్తులు ఎగరగలవు కాబట్టి, పెంపకంలోనున్న వాటి రెక్కలకు ఎగిరిపోకుండా క్లిప్పులు వేస్తారు.

 src=
ఎగురుతున్న రోహితపక్షులు-రియో లగార్టోస్, యుకాతాన్, మెక్సికోలో

రోహిత పక్షి శిశువులు బూడిద-ఎరుపు రంగుతో జన్మిస్తాయి. పెద్దపక్షులు లేతగులాబీ నుండి మంచి ఎరుపురంగుతో ఉంటాయి. పెద్దపక్షులలా ఉండటానికి కారణం- అవి తినే ఆహారములో ఎక్కువ శాతం ఉండే నీటిసూక్ష్మక్రిములు, బీటా-కెరొటీను. బాగా పోషింపబడిన రోహిత పక్షి చూడటానికి అద్భుతమైన ఎరుపురంగుతో ఉంటుంది. సరిగా పోషింపబడని రోహిత పక్షి చూడటానికి పాలిపోయి తెలుపురంగులోకి మారిపోతుంది. పెంపకంలోనున్న రోహిత పక్షులకు పోషకాలు సరిగా అందించాలి. లేదంటే అవి తమ అందమైన ఎరుపు వర్ణాన్ని కోల్పోతాయి.

ఘనరోహిత పక్షి రోహితజాతులలోకెల్ల పొడవైనది- నిలబడితే 3.9-4.7 అడుగులతో (1.2-1.4 మీటర్లు), 3.5కిలోల బరువుతో ఉంటుంది. పొట్టిరోహిత పక్షి 2.6 అడుగుల పొడవుతో, 2.5 కిలోల బరువుంటుంది. రోహిత పక్షుల విప్పిన రెండు రెక్కలవెడల్పు కనిష్ఠం 94 సెం.మీ||ల (37 అంగుళాలు) నుండి గరిష్ఠం 150 సెం.మీ||లు (59 అంగుళాలు) ఉంటుంది.

ప్రవర్తన , జీవావరణ శాస్త్రం

ఆహారము

రోహిత పక్షులు ప్రథమంగా ఉప్పురొయ్యలు, నీటినాచు దానితోపాటు చిన్న చిన్న పురుగులు, నత్తగుల్లలు, ఆల్చిప్పలు, పీతలు మొదలైన వాటిని తింటాయి. ఈ పక్షులు సర్వభక్షకాలు (శాకాహారము, మాంసాహారము రెండింటిని తినేవి). వాటి చప్పుటాలు (ముక్కులు) అవి తినే ఆహారంలోని మట్టిని వడగట్టేలా సహాయపడతాయి. ఆ వడకట్టు పద్ధతికి వాటి చప్పుటాలలోనున్న "లామిల్లే" అనే వెంట్రుకలుంటాయి.

 src=
అమెరికా రోహిత పక్షి, దాని శిశువు

జీవిత చక్రం

రోహిత పక్షులు చాలా సామూహికప్రాణులు. అవి వేలసంఖ్యగల గుంపులుగా నివసిస్తాయి. దానికి కారణాలు మూడు: ఒకటి సంరక్షణ కోసం, రెండు ఆహారం కోసం, మూడు గూళ్లను నిర్మించుకోవడం కోసం; సంతానోత్పత్తికి ముందు, ఒక పెద్ద గుంపునుండి, పదిహేను నుండి యాభై పక్షులు చొప్పున చిన్నచిన్నగుంపులుగా విడిపోతాయి. ఈ చిన్నగుంపులలోనున్న మగ-ఆడ పక్షులు ఏకకాలంలో పరస్పర ఆకర్షణకై తమ తమ అందచందాలను ప్రదర్శన చేస్తాయి. మెడలు చాచి, రెక్కలాడిస్తూ మధురంగా శబ్దాలు చేస్తూ ఆడుతాయి. అలా జరిగిన పిదప పరస్పరం ఆకర్షితమైన పక్షులు జతకడతాయి. రోహిత పక్షులు బలమైన బంధాలను ఏర్పరుచుకుంటాయి. గుంపులో ఎక్కువ పక్షులు ఉన్నందువలన అవి అప్పుడప్పుడు తమ జీవితభాగస్వాములను మార్చుకుంటాయి, పంచుకుంటాయి. జతకట్టిన రోహితాలు సంతానోత్పత్తికి పూనుకోని, తమతమ గూళ్లను సంరక్షించుకుంటాయి. ఆడపక్షి ముందుగాతాను గ్రుడ్లుపెట్టబోయే చోటును నిర్ణయించుకుంటుంది. తర్వాత మగపక్షితో కలిసి రతిక్రీడకు ఉపక్రమిస్తుంది. రతిక్రీడసాధారణంగా గూడుకట్టుకున్నాక మొదలౌతుంది. ఆ సమయాలలో ఇతర రోహితపక్షి జంటలు, అదే గూడు ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తాయి. అప్పుడు రోహితపక్షులు తమ గూళ్లను కాపాడుకోవడానికి దారుణంగా కృషిచేస్తాయి. మగ-ఆడ పక్షులు రెండు కలిసి గూడుకడతాయి, రెండు తమ పిల్లలను రక్షించుకోవడానికి సమానంగా కృషి చేస్తాయి. అప్పుడప్పుడు స్వలింగ సంపర్కము కూడా జరుగుతుందనడానికి ఆధారాలున్నాయి. గ్రుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చాక, మగ-ఆడ పక్షులు తమ తమ పిల్లలకు పాలు పడతాయి. ఆ పాలు మగ-ఆడ పక్షుల కడుపులలో "ప్రోలాక్టిన్" అనే హార్మోన్ కారణంగా పిల్లలు పుట్టాక ఊరడం ప్రారంభమౌతాయి. ఆ పాలను తమ నోటిదాకా తెచ్చి పిల్లల నోట్లోపోస్తాయి. ఆ పాలలో కొవ్వుపదార్థాలు, మాంసకృతులు, ఎరుపు, తెలుపు రక్తకణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 src=
తన శిశువుకు తిండిపెడుతున్న చిలీదేశపు రోహితపక్షి

పిల్లలు పుట్టిన మొదటి ఆరురోజులు, తల్లి-తండ్రి పక్షులు పిల్లలతోనే సమయం గడుపుతాయి. పుట్టిన 7-12 రోజులు తర్వాత పిల్లలు గూడు బయటికివచ్చి చుట్టూవున్న ప్రదేశాలను పరిశీలించి అలవాటు చేసుకుంటాయి. రెండు వారాలు గడిచాక, అన్ని గూళ్లలో ఉన్న ఈ పిల్లపక్షులన్నీ ఒకచోట చేరి ఆడుకుంటాయి. అప్పటినుండి పిల్లపక్షులను పెద్దపక్షులు వదిలేసి వెళ్ళిపోతాయి. పిల్లపక్షులన్నీతమ కొత్త గుంపులోనే ఉంటూ యుక్తవయసు వచ్చేవరకు కలిసి బ్రతుకుతాయి.

 src=
నకురూ అనే సరస్సువద్దనున్న రోహిత సమూహం

ప్రస్తుత స్థితి , పరిరక్షణ

పెంపకంలో

ఐరోపాదేశపు జంతుప్రదర్శనశాలలో మొట్టమొదటగా పుట్టిన రోహిత పక్షి1958లో స్విట్జర్లాండ్లోని "జూ బేసెల్"లోనిది. అప్పటినుండి, 389కు పైగా అదే జూలో పెంచబడ్డాయి , ఇతర ప్రపంచవ్యాప్తంగానున్న జూలకు తరలింపబడ్డాయి.

"గ్రేటర్" అని పిలువబడే ఒక 83 ఏళ్ల రోహితపక్షి, (ప్రపంచంలోకెల్లా అతివయస్సుగల రోహితపక్షిగా నమ్మబడినది) "ఎడలైడ్ జూ", ఆస్ట్రేలియాలో జనవరి,2014లో కన్నుమూసింది.

మానవులతో సంబంధం

 src=
లిమా నగరం, పెరూదేశంలోని లార్కో వస్తుసంగ్రహశాలలో రోహిత పక్షి బొమ్మగల ఒక పింగాణీ తరళము
  • పురాతన రోము నగరంలో, వాటి నాలుకలను రుచికరమైనవిగా తినేవారు.
  • దక్షిణామెరికాలోని పెరూదేశపు మోషే అనే కొండజాతివారు ప్రకృతిని పూజించే విధానంలో భాగంగా జంతువుల-పక్షుల బొమ్మలను వస్తువులపై గీసేవారు.
  • బహామాస్ దేశపు జాతీయపక్షి రోహితపక్షి
  • ఒకప్పుడు గనులు తవ్వేవారు ఈ రోహితపక్షులను చంపితినేవారు, వాటి కొవ్వు ఉబ్బసం, క్షయవ్యాధులకు మందుగా వాడేవారు.
  • అమెరికా ఐక్యరాష్ట్రాలలో, ఈ గులాబిరంగు రోహితపక్షిబొమ్మలను తోటలలో, పెరడులలో అందానికి పెట్టుకోవడం ఆచారంలో ఉంది.

ప్రస్తావనలు

బాహ్య లంకెలు

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages